రాష్ట్రంలో ఈ యాసంగికి మినుములను రైతులు సాగు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan reddy news) సూచించారు. హైదరాబాద్‌లో మార్క్‌ఫెడ్ పాలకవర్గ సభ్యుల సమావేశానికి హాజరైన మంత్రి... ఈ యాసంగిలో వరికి బదులు మినుములు విరివిగా సాగుచేస్తే పూర్తి స్థాయిలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టంచేశారు. రైతులు వెంటనే మినుము విత్తుకోవాలని విజ్ఞప్తిచేశారు. సాధారణంగా మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలకి రూ.6300 ఉందన్న ఆయన... రైతుల కోసం అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా మినములు, మినప పప్పు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ను సంప్రదించిందని మంత్రి(Niranjan reddy news) అన్నారు. రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి నాఫెడ్ సంస్థ లిఖితపూర్వక హామీ గురువారం ఇచ్చిందని తెలిపారు. తక్కువ పెట్టుబడితో నికర ఆదాయాలు ఇచ్చే మినుములతోపాటు బహిరంగ మార్కెట్‌లో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థ ఛైర్మన్ మార గంగారెడ్డి, ఎండీపీ యాదిరెడ్డి, ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థ కార్యకలాపాలపై విస్తృతంగా చర్చించారు.
ఇదీ చదవండి: paritala sunitha Comments: మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం: పరిటాల సునీత