వినియోగదారులకు శుభవార్త. హైదరాబాద్ జంట నగరాల్లో ఉల్లిగడ్డల ధరలు 80 నుంచి 90 రూపాయలకు పెరిగిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం... వ్యాపారులు నిల్వచేసే పరిమితులపై ఆంక్షలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లి సరఫరా చేపట్టింది.
దసరా పండుగ పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చిల్లర మార్కెట్‌లో ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ రైతుబజార్లలో రాయితీ ధరలపై ఉల్లిగడ్డ సరుకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
వినియోగదారుల సౌకర్యార్థం ఇవాళ్టి నుంచి వనస్థలిపురం, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్, మెహిదీపట్నం, ఎర్రగడ్డ, భరత్‌నగర్, కుకట్‌పల్లి తదితర 11 రైతుబజార్లలో ఉల్లిగడ్డ కిలో ధర 35 రూపాయల చొప్పున విక్రయించనున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
ఉల్లిధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయించనున్న దృష్ట్యా... ఆధార్ గుర్తింపు కార్డ్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు, ఇతర ఏదైనా గుర్తింపు కార్డు చూయించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిందని తెలిపారు. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేపడతామని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి 90 రూపాయలు పలుకుతోంది.