దిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై కేంద్రం దమనకాండ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిరసన తెలుపుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పంజాబ్, హర్యానా రైతుల బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఛలో దిల్లీ పిలుపు ఇస్తే.. పోలీసులు రానీయకుండా ఇనుప కంచె వేసి తీవ్రంగా వ్యవహరించారని మంత్రి అన్నారు. చలి ఉన్న సమయంలో భారతదేశ వెన్నుముకైన అన్నదాతపై చన్నీళ్లు, భాష్ప వాయువు ప్రయోగించడం జాతికే అవమానకరమని వ్యాఖ్యానించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సమస్యలు పట్టించుకోకపోగా.. కొత్త చట్టాలతో మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం సహా.. విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి రాష్ట్రాలు అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానానికి చరమగీతం పాడేలా.. ఈ సవరణ బిల్లు ఉండటం కలవరపెడుతోందని మంత్రి తెలిపారు. ఎంఎస్‌పీ విధానం ప్రస్తావన బిల్లుల్లో లేకపోవడం, ఏపీఎంసీలను నిర్వీర్యం చేయడం, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండడం వల్ల రైతులు అభద్రతకు లోనవుతున్నారని ధ్వజమెత్తారు.
2017లో తమిళనాడు రైతులు దిల్లీ జంతర్ మంతర్ వద్ద 40 రోజులకుపైగా పుర్రెలతో వినూత్నరీతిలో రుణమాఫీ, కావేరీ నదీ జలాల సమస్యలపై ఆందోళనచేస్తే పట్టించుకోకపోవడంతో రైతులు దుఃఖిస్తూ వెనుదిరిగారని గుర్తుచేశారు. ఆ ఫలితం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా, మిత్రపక్షం ఏఐఏడీఎంకే చవిచూశాయని ఎద్దేవా చేశారు. 2017లో మధ్యప్రదేశ్‌లో అప్పటి భాజపా ప్రభుత్వం.. రైతులు హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా.. ఆరుగురు మరణించిన ఫలితం.. ఆ పార్టీ 2018 ఎన్నికల్లో చవిచూసిందని చెప్పారు.
2018లో మహారాష్ట్రలో జరిగిన "కిసాన్ లాంగ్ మార్చ్" వల్ల రైతుల కాళ్లపై వచ్చిన పుళ్లు ఇంకా భారతీయ ప్రజల కళ్లల్లో మెదులుతున్నాయని అన్నారు. ఇప్పుడు రైతులకు భరోసా ఇవ్వకుండానే పుట్టి ముంచే చట్టాలు ముందుకు తెచ్చారని దుయ్య బట్టారు. దేశవ్యాప్త రైతు ఆందోళనలు కేంద్రం గుర్తించి డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : గ్రేటర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో