రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలులో రైతుబంధు సమితులు కీలకంగా పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల అధ్యక్షులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, వివిధ జిల్లాల రైతుబంధు సమితుల అధ్యక్షులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగే నియంత్రిత పంట సాగు విధానం, రాబోయే వానా కాలం సీజన్‌లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. రైతుబంధు సమితులు రైతాంగం గొంతుక వినిపించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే నికరమైన ఆదాయం వస్తుందని రైతులను ఒప్పించాలని సూచించారు.
అడగక ముందే రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టు ద్వారా సాగు నీరు, వ్యవసాయానికి 24 గంటల నిరంతయా విద్యుత్తు ఇచ్చిన దృష్ట్యా... రైతులను రాజులను చేసేందుకే ముఖ్యమంత్రి సమగ్ర వ్యవసాయ ప్రణాళిక తీసుకువచ్చారని తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలో వానా కాలం పంట సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో... కల్తీ విత్తనాలు దొరికితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
ఇవీ చూడండి: సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్'