హైదరాబాద్ నగర నలుమూలలా మార్కెట్‌ల నిర్వహణకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. నూతన మార్కెట్ల ఏర్పాటుతో ప్రజలకు అందుబాటులోకి రావడమే కాకుండా రైతులకు కూడా ఇబ్బందులు తగ్గుతాయని మంత్రి పేర్కొన్నారు. బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడే ఉన్న కూరగాయాల మార్కెట్‌ను పరిశీలించారు. అనంతరం 2019-20 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌పై అధికారులతో సమీక్షించారు.
ఖరీఫ్ సీజన్ ముగిసిన నేపథ్యంలో వ్యవసాయోత్పత్తులు మార్కెట్లకు వస్తున్నందున... గిట్టుబాటు ధరల కల్పన, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బోయిన్పల్లి మార్కెట్ 13 రాష్ట్రాలకు కూరగాయాల అమ్మకానికి ప్రధానమైందని.. నగరానికి రోజుకు దాదాపు నాలుగు వేల మెట్రిక్ టన్నుల కూరగాయాలు వస్తే... ఒక్క బోయిన్పల్లి మార్కెట్‌కే 1500 నుంచి 2వేల మెట్రిక్ టన్నుల కూరగాయాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్ పక్కన ఉన్న స్థలం లీజుకు లేదా ప్రత్యామ్నాయ స్థలం అప్పగించే ప్రతిపాదనపై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టాలని సూచించారు. రైతులు, వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా బోయిన్పల్లి మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్‌లో వచ్చే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే బయోగ్యాస్ ప్లాంట్ పరిశీలన... మరింత విస్తరించాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌లో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టాలన్నారు.
ఈ కథనం చదవండి: నేరాలు-ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతం