రాష్ట్ర వ్యవసాయోత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని... మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మినిస్టర్ క్వార్టర్ట్స్‌లోని తన నివాసంలో రాష్ట్ర పంట ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు.
'తెలంగాణ సోన - మార్కెటింగ్ వ్యూహం'పై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు. రైతుల పంటలకు మార్కెటింగ్ కల్పన లక్ష్యంగా గత ఆరు మాసాలుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కలిసి ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అడుగులు వేస్తున్నాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ పంట ఉత్పత్తుల గొప్పతనం ప్రజలకు తెలియాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు ముందుకు సాగుతున్నామని ప్రకటించారు. ప్రభుత్వ పరంగా రైతుల ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయాలన్న ఆలోచన ఇంత వరకు ఎవరూ చేయలేదు... ఇది ప్రభుత్వ గొప్ప నిర్ణయమని చెప్పారు. 25 ఏళ్ల క్రితం అప్పటి పంజాబ్ ప్రభుత్వం బాసుమతి బియ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేయడానికి ముందుకురావడం మినహా మరే దాఖలాల్లేవని గుర్తు చేశారు.
తెలంగాణ సోన గతంలో 4 లక్షల ఎకరాల్లో సాగు చేయగా... ఈ ఏడాది 10 లక్షల ఎకరాలకు పెరిగడం చూస్తూ లభిస్తున్న ఆదరణకు ఇది నిదర్శనం అన్నారు. ఇది ఏడు రాష్ట్రాల్లో కూడా మరో 5 లక్షల ఎకరాలలో సాగవుతోందని స్పష్టం చేశారు. కేవలం 50 శాతం మంది వినియోగదారులకు మాత్రమే తెలంగాణ సోనాపై అవగాహన ఉన్నందున మరింత మందికి తెలియజేస్తే మరింత ఆదరణ లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.