రైతు వేదికలు అన్నదాతలకు సరైన దారి చూపిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శాసనసభకు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా రైతు వేదికల ప్రయోగం ఎక్కడా లేదన్న మంత్రి... ఆధునిక పద్ధతిలో వ్యవసాయానికి, రైతులను సంఘటిత పరిచేందుకు ఉపయోగపడతాయన్నారు. రైతుల తలరాత మార్చేవే రైతు వేదికలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయం మీద పట్టు రావాలంటే ప్రతి అంగుళంలో ఏమి జరుగుతుంది అన్నది తెలుస్తుందని మంత్రి వివరించారు. అందుకే ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతు వేదికలు, నర్సంపేటలో మిరప పరిశోధన కేంద్రాలపై శాసనసభలో సభ్యులు రసమయి బాలకిషన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, రమావత్ రవీంద్ర కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 572 కోట్ల 22 లక్షల వ్యయంతో 2, 601 నిర్మాణాలు చేపట్టగా.. ఐదు మాత్రమే ఆగిపోయాయని తెలిపారు. స్థలాలపై కోర్టు కేసులతో ఆగిపోయిన ఆ ఐదింటిని పూర్తి చేస్తామని నిరంజన్‌రెడ్డి వివరించారు. 22 రైతు వేదికలను ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు దాతలుగా నిర్మించారని మంత్రి ప్రశంసించారు.
రామాయంపేటలో కేటీఆర్ సతీమని శైలిమ రైతు వేదికకు సాయం చేశారని అభినందించారు. రైతు వేదికలకు నిర్వహణ వ్యయంగా నెలకు 8 వేలు బడ్జెట్‌లో కేటాయించామని అన్నారు. రైతు వేదికలు ప్రజల అవసరాలకు వాడుకునే వెసులుబాటు కల్పిస్తారా అని సభ్యులు ప్రశ్నించగా.. పరిశీలిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రైతులకు నూతన వంగడాలు నూతన సాగు పద్దతులు రైతుల విజయగాధలు వ్యవసాయానికి సమగ్ర అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు ఉపయోగపడుతాయని మంత్రి వివరించారు. వ్యవసాయం బలోపేతానికి నిరంతరం పరిశోధనలు జరుతున్నాయన్నారు. కందులు వేరుశనగ పత్తి మిరప పరిశోధనలకు కేంద్రాలు ఏర్పాటుతోపాటు.. నర్సంపేటలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి : శాసనసభలో పలు బిల్లులకు ఆమోదం