Minister Mallareddy Interesting Comments : తన మాటలతో, చేష్టలతో, ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మంత్రి మల్లారెడ్డి.. మరోసారి ప్రచారంలోకెక్కారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, సినిమా ఫంక్షన్ అయినా.. వేదిక ఏదైనా మల్లారెడ్డి ఉన్నారంటే ఆ సందడే వేరు. ఆయన మైక్ పట్టుకున్నారంటే చాలు.. 'కష్టపడ్డా.. పాలమ్మినా.. సక్సెస్ అయ్యా' డైలాగ్ ప్రేక్షకుల నుంచి వినబడక మానదు. ఆ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలోనూ తెగ పాపులర్ అయిన మంత్రి మల్లారెడ్డి.. తాజాగా ఇవాళ అసెంబ్లీ లాబీ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Mallareddy Comments on Congress : తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ శాసన సభ సమావేశాలలో పాల్గొన్నారు. సమావేశాలనంతరం అసెంబ్లీ లాబీలో మాట్లాడిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుండాలో తానే నిర్ణయిస్తానని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి టికెట్ తానే ఇప్పించినట్లు చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో తనకు స్నేహితులు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప మాట్లాడేందుకు మరొకటి లేదని మల్లారెడ్డి అన్నారు.
త్వరలో మీడియా సంస్థను ఏర్పాటు చేస్తా : మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజలు తాను చేసిన అభివృద్ధిని మరిచిపోయి.. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు వింటున్నారని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ ఉంటే తన పదవి ఊడుతుందని కొందరు ప్రచారం చేశారన్నారు. కొంతమంది తనపై కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మల్లారెడ్డి... త్వరలో మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ యాసకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు కూడా నిర్మించబోతున్నట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
Telangana Assembly Sessions 2023 : అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే తొలుత కొంతకాలం క్రితం మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు శాసనసభ నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పనిచేసిన సాయన్న... జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం, మంత్రులు, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సాయన్న సేవలను కొనియాడారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. అలాగే శాసనసభ సమావేశాలు ఆదివారం వరకు జరపాలని... బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశమైన... సభా వ్యవహారాల సలహా సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. మూడు, నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇవీ చదవండి :