ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తోన్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రోత్సహకాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖలో పేర్కొన్నారు.
కొవిడ్ సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఫియట్ క్రిస్లర్ ఆటో మొబైల్స్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని లేఖలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందన్నారు. ఇలా ఐటీ అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందువరుసలో ఉన్న హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్రమంత్రిని కోరారు.
గతంలోనూ..
ఈ సందర్భంగా ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సంప్రదింపులు జరిపిందని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అనేక సార్లు ఐటీఐఆర్ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాల్సిందిగా ప్రధాని మోదీని కోరారన్నారు.