హైదరాబాద్‌లో ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి ఆటంకం లేకుండా కొనసాగాలంటే తెరాసకే ఓటెయ్యాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. బల్దియా ప్రచారంలో భాగంగా.. మూడో రోజు మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతదని చేసిన అబద్దపు ప్రచారాలను పటాపంచలు చేస్తూ.. ఆరేళ్లలో రాజధానిని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించామని కేటీఆర్ తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతో అనేక కంపెనీల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. తెరాసను గెలిపిస్తే సంక్షేమం, అభివృద్ధి ఆటంకం లేకుండా ముందుకెళ్తుందని హామీ ఇచ్చారు.
ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు
ఆరేళ్లలో కేంద్రానికి రాష్ట్రం ఇవ్వడమే తప్ప రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది శూన్యమని కేటీఆర్ విమర్శించారు. నగర అభివృద్ధికి కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతరాహిత్య ప్రకటనలో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పన్నులు, వరద సాయం సహా ప్రతి విషయంలోనూ కేంద్రం పక్షపాత ధోరణిని అవలంబించిందని విమర్శలు గుప్పించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో గుంతలు లేని రోడ్లు చూపిస్తే పదిలక్షల నజరానా ఇస్తానని సవాల్ విసిరారు.
రిజిస్ట్రేషన్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
హైదరాబాద్‌లో గులాబీలు కావాలో? గుజరాత్ గులాములు కావాలో తేల్చుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భాజపా వాళ్లు ఓట్లు అడిగేందుకు వస్తే ఏం ఇచ్చారని ఓట్లడుగుతున్నారో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ వాసులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఆరేళ్లలో నెరవేర్చామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రిజిస్ట్రేషన్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. …
ఇదీ చదవండి: గ్రేటర్ పోరు.. తెరాస ప్రచార హోరు