పట్టణ ప్రగతి కార్యక్రమంతో మంచి మార్పునకు బీజం పడిందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో ప్రగతి కార్యక్రమం తొలి అడుగుగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో జిల్లాల అదనపు కలెక్టర్లు, పురపాలక శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పది రోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా కలిసి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మంత్రి ధన్యవాదాలు చెప్పారు.
దీర్ఘకాలిక సమస్యలు
పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన అనేక దీర్ఘకాలిక సమస్యలను గుర్తించామన్నారు. వీటితోపాటు పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించామన్నారు. గుర్తించిన దీర్ఘకాలిక సమస్యలను భవిష్యత్లో ప్రణాళికబద్దంగా పరిష్కరించేందుకు పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టణాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం వార్డు కమిటీలతోపాటు పట్టణ ప్రజలను భాగస్వాములను చేస్తూ.. వారిని నిరంతరం చైతన్య పరుస్తూ ముందుకు పోవాలన్నారు.
రోడ్ మ్యాప్
నూతన పురపాలక చట్టం తప్పనిసరి చేసిన ప్రాథమిక కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత మున్సిపాలిటీల్లో ఉన్న మౌళిక వసతులు, పౌర సౌకర్యాలపై ఒక సంపూర్ణ నివేదిక రూపొందించాలన్నారు. మున్సిపాలిటీలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకుని పనిచేయాలన్నారు.
దశల వారీగా పూర్తి
పట్టణాల్లో మోడల్ మార్కెట్లు, పార్కులు, డంపు యార్డులు, శౌచాలయాలు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, నర్సరీలు, శ్మశాన వాటికలు, బహిరంగా వ్యాయమశాల వంటి సౌకర్యాలను ఉండేలా చూడాలన్నారు. రానున్న నాలుగేళ్లలో దశల వారీగా పూర్తి చేసేందుకు వీలున్న అంశాలు ముందే నిర్దేశించుకోవాలని కేటీఆర్ సూచించారు.
ఇదీ చదవండి: 'ఈనాడు'కు మరో గౌరవం- ఉత్తమ వార్తా పత్రికగా చాణక్య పురస్కారం