Ktr On Kazipet Coach factory: రాష్ట్ర భాజపా నేతలకు దమ్ముంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని నిలదీయాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడం పచ్చి దగా అని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు అనుగుణంగానే రైల్వే మంత్రి మాట్లాడారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అన్ని విషయాల్లో ద్రోహం చేయడమే భాజపా విధానమా అని ప్రశ్నించారు.
వారంతా తెలంగాణ వ్యతిరేకులే
ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రతీ భాజపా నాయకుడు తెలంగాణ వ్యతిరేకులేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా వంటి పునర్విభజన చట్టంలోని హామీల అమలులో మోదీ సర్కారు తీవ్ర వివక్ష చూపిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణపై సవతి ప్రేమ
మోదీ సర్కారు తీరును చూసి ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైల్యే కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు.. 150 ఎకరాలను కేంద్రానికి ఇచ్చిందని తెలిపారు. మరట్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 625 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం తెలంగాణపై మాత్రం సవతి ప్రేమను చూపించిందన్నారు. రాష్ట్రాభివృద్ధి పట్ల కేంద్ర కుట్రపూరిత విధానాలను ప్రజలు తప్పక తిప్పి కొడతారన్నారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: