ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కొనియాడారు. వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ప్రత్యర్థులూ అభినందించాల్సిందేనని ఆయన అన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. భాజపా దిల్లీ నుంచి గల్లీ దాకా అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు చరిత్ర ఉంది కానీ.. భవిష్యత్ లేదని దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ భేటీ అయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, తెరాస కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించారు.
భాజపాకు తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు. వైద్య కళాశాలలో కేటాయింపుల్లోనూ అన్యాయం చేసింది. కేంద్రం మోపిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను గుర్తుచేసుకోవాలి. ఇప్పటికే 1,33,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటులో సుమారు 14 లక్షల ఉద్యోగాలను సాధించగలిగాం.
-- కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
ఇదీ చూడండి: గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ... ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ