KTR speech in Legislative Council: రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాల్లో ఎక్కడా అక్రమాలు జరగలేదని పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టానికి పలు సవరణలు చేశామని తెలిపారు. భూ కేటాయింపులు ఒకటికి రెండుసార్లు చూసి చేశామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ శాసనమండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ ఏరియాలోని అజమాబాద్‌లో 136 ఎకరాల్లో పలు పరిశ్రమలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం 58 కంపెనీలు అక్కడ ఉన్నాయని.. వాటికి 30 ఏళ్ల లీజ్ ఇస్తూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. రామ్‌నగర్ ఏరియాలో ఆధునిక ఫిష్ మార్కెట్ కట్టాలని నిర్ణయించామని.. బస్ భవన్‌కూ కొంత స్థలముందని తెలిపారు. అక్కడ ప్రజాపయోగ్యమైన పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని.. స్టూడియోల పేరుతో ఇతర నిర్మాణాలు చేపట్టారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 1,234 ఎకరాలు స్వాధీనం చేసుకుందని.. అజమాబాద్‌లో 9 యూనిట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని తెలిపారు. 2003లో జీవో నెంబర్ 20 ద్వారా కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. వాణిజ్యపరమైన అవసరాలకూ అజమాబాద్ భూములను వాడుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ చట్టానికి చేసిన పలు సవరణలను కేటీఆర్ వివరించారు.
ముషీరాబాద్ అజమాబాద్‌లో 136 ఎకరాల్లో వివిధ పరిశ్రమలు ఉన్నాయి. అజమాబాద్‌లో ప్రస్తుతం 58 కంపెనీలు ఉన్నాయి. 30 ఏళ్లు లీజ్‌కు ఇస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 36 మంది వ్యాపారం చేస్తున్నారు.. 22 మంది సబ్ లీజ్‌కు ఇచ్చారు. అజమాబాద్‌లో ప్రజోపయోగ పనులు చేయాలని నిర్ణయించాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి. స్టూడియోల పేరుతో ఇతర నిర్మాణాలు చేపట్టారు. మేం పరిశ్రమలకు ఇచ్చిన స్థలాల్లో ఎక్కడా అక్రమాలు లేవు. అజమాబాద్ భూములను వాణిజ్య అవసరాలకూ వాడుకుంటాం.- కేటీఆర్
జీహెచ్‌ఎంసీలో 5 నుంచి 15 మందికి కో-ఆప్షన్ సభ్యులను పెంచుకోవడానికి చట్టం తెస్తున్నామని కేటీఆర్ వివరించారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టడానికి 3 నుంచి 4 సంవత్సరాలకు పెంచడానికి నిర్ణయించామన్నారు. క్యాతంపల్లి పేరు రామకృష్ణాపూర్ మున్సిపాలిగా పేరు మార్పు.. ములుగు జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ మున్సిపల్ చట్ట సవరణ, ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిల్ సమావేశాలకు ఆహ్వానితులేనని సవరణలో నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. కో-ఆప్షన్‌లో రిజర్వేషన్‌లు లేవని.. రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అల్ప సంఖ్యాకులకు ప్రాతినిధ్యం ఉండేందుకు కో-ఆప్షన్ సభ్యులుగా నియమిస్తామని కేటీఆర్ వివరించారు.
ఇవీ చూడండి..
'సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారు.. అప్పటివరకు సమ్మె ఆపేదే లే'
భాజపా 'చలో సెక్రటేరియట్'లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో కీలక నేత