KTR laid foundation stone for Genpact: హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ జెన్‌ప్యాక్ట్.. ఉప్పల్‌లో తన కార్యాలయాన్ని విస్తరించనుంది. సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. సంస్థ విస్తరణతో ఉద్యోగాల కల్పనకు దోహదపడుతున్నందుకు గాను.. జెన్ప్యాక్ట్కు కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే తూర్పు హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగాల లక్ష్యానికి సమీపిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ హైదరాబాద్‌కు దీటుగా తూర్పు హైదరాబాద్ ఎదుగుతోందని వెల్లడించారు.
అభివృద్ధి దిశగా ఉప్పల్
"జెన్ ప్యాక్ట్ సంస్థకు హృదయపూర్వక అభినందనలు. సంస్థ విస్తరణ పూర్తయితే లక్ష ఉద్యోగాల లక్ష్యానికి సమీపిస్తాం. హైదరాబాద్ నలువైపులా 20 లక్షల చదరపు అడుగుల్లో నూతన కార్యాలయాల్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుంది. తూర్పు హైదరాబాద్ అభివృద్ధి కోసం నాగోల్‌లో శిల్పారామం ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ ప్రాంతంలోనే ఉంది. ఉప్పల్ నుంచి నారాపల్లి దాకా స్కైవే నిర్మాణం జరుగుతోంది. ఉప్పల్ జంక్షన్లో స్కై వాక్(కారిడార్) నిర్మాణ దశలో ఉంది." -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
వరంగల్‌లోనూ విస్తరణ
తూర్పు హైదరాబాద్‌లో ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నారని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందని భరోసా ఇచ్చారు. జెన్‌ప్యాక్ట్‌ను వరంగల్‌లోనూ విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కొనసాగుతోందని పేర్కొన్నారు. కొవిడ్ తగ్గుముఖం పట్టాక.. ఇక్కడి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మళ్లీ క్రికెట్ ప్రారంభం అవుతుందని.. అప్పుడు జనంతో ఈ ప్రాంతం కళకళలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెన్‌ప్యాక్ట్ ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: PSLV C-52 Countdown: పీఎస్‌ఎల్‌వీ-సీ52 కౌంట్‌డౌన్ ప్రారంభం