ఈనెల 9న లాక్‌డౌన్ పూర్తయ్యే నాటికి కరోనా తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలి టిమ్స్(TIMS)లో హైసియా ఆధ్వర్యంలో సమకూర్చిన 150 ఐసీయూ బెడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం టిమ్స్‌లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులను(VOVID VICTIMS)పరామర్శించారు. వాళ్లకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యాధికారులు, వైద్యులతో మాట్లాడిన మంత్రి.. వాళ్ల సేవలను ప్రశంసించారు.
రూ. 15 కోట్ల వ్యయంతో ఐటీ కంపెనీల సహకారంతో 150 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసిన హైసియా సభ్యులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మొదటి దశలో వైద్య పరికరాలు అందించి ఆదుకున్న ఐటీ కంపెనీలు.. ఇపుడు మళ్లీ సామాజిక బాధ్యత కింద సహాయ పడుతున్నారని పేర్కొన్నారు.
వాటిని కొనుగోలు చేయాలి
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. దాదాపు ఆస్ట్రాజెనిక(ASTRAGENIKA) వ్యాక్సిన్ 50 కోట్ల డోసులు విదేశాల్లో నిరుపయోగంగా ఉన్నాయన్న మంత్రి కేటీఆర్.. వ్యాక్సిన్ కొనకుండా ఇతర దేశాలకు కేంద్రం ఎగుమతి చేసిందని ఆరోపించారు. అమెరికా, నార్వే, కెనడా, డెన్మార్క్ వంటి దేశాల్లో ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ నిరుపయోగంగా ఉన్నాయని.. వాటిని భారత్‌కు తెప్పించాలని సూచించారు. వైద్యుల సంఖ్యను డిమాండ్‌కు అనుగుణంగా ఏర్పాటు చేస్తామన్న మంత్రి.. ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో ఈ విపత్తు నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రామికవర్గాల వారికి ప్రాధాన్య క్రమంలో వ్యాక్సినేషన్ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇంటింటి సర్వే ద్వారా నివారణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.
ఇదీ చదవండి: Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా