బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో హైదరాబాద్‌లో లక్షా 80 వేల మంది ఉపాధి పొందుతున్నారని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్థిక కార్యాకలాపాలు నిర్వహించే గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ కార్యాలయాన్ని రాయదుర్గంలో మంత్రి ప్రారంభించారు. మూడేళ్లలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌కు తెలిపారు. పది వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను రూపొందించాలని గోల్డ్‌మ్యాన్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. సంస్థ లక్ష్యాన్ని అభినందించిన కేటీఆర్... ఇందుకోసం వీ-హబ్‌తో కలిసి పని చేయాలని సూచించారు.
'బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగాల్లో హైదరాబాద్ వేగంగా వృద్ధి చెందుతోంది. గడిచిన కొన్నేళ్లలో ప్రతిష్ఠాత్మక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఈ రంగాల్లో లక్షా 80 వేల మంది కేవలం హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారు. ఈ రంగాల్లో భాగ్యనగరానికి ఉన్న అనుకూలతలే ఇందుకు ఉదాహరణ. ఐఎస్‌బీ, ఐఐఎం బెంగళూరు సహాకారంతో దేశవ్యాప్తంగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను రూపొందించాలన్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ లక్ష్యాన్ని అభినందిస్తున్నాను. ఇందుకోసం హైదరాబాద్‌లోని వీ-హబ్‌తో కలిసి పని చేయాలని కోరుతున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ సాంకేతికతల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్థిక రంగంలో మరిన్ని ఆవిష్కరణల రూపకల్పనకు టీ-హబ్ దోహదపడుతుందని ఆశిస్తున్నా.'-కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి
ఈ కార్యాలయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తామని సంస్థ భారత విభాగాధిపతి గుంజన్ సంతాని, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవికృష్ణన్‌లు తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై కీలక సమావేశం