KTR Review Of old City Development Works: ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నలుమూలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ విధానమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ సహా పాతబస్తీ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం సభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సహా అధికారులు పాల్గొన్నారు. భాగ్యనగర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి రోజు నుంచి పాటుపడుతూ వస్తోందన్నారు.
పాతబస్తీ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఈ సమావేశంలో మంత్రికి అందజేశారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో ఇప్పటికే రహదారుల్ని బలోపేతం చేశామని.. ఫ్లై-ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని కేటీఆర్ చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పాతబస్తీలో రోడ్డు విస్తరణ కొంత సవాల్‌తో కూడుకుందని తెలిపారు. రోడ్డు వైడనింగ్ తప్పనిసరైన ప్రాంతాల్లో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భూసేకరణ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ట్రాఫిక్ జంక్షన్‌లతో పాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, మూసీపై బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తున్నామని వివరించారు. చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పనులు సైతం దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు. పాతబస్తీ పరిధిలోను తాగునీరు సరఫరా మెరుగుపడిందన్నారు. ఇందుకోసం రూ.1200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.
పాతబస్తీలో రెండున్నర లక్షలకు పైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీరు అందుతుందని కేటీఆర్ తెలిపారు. పాతబస్తీలో 84 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పాతబస్తీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎంఐఎం శాసనసభాపక్ష అక్బరుద్దీన్ ఒవైసీ.. కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి: