నిరుపేద కుటుంబానికి చెందిన ఐఐటీ విద్యార్థినికి పురపాలక మంత్రి కేటీఆర్ చేయూత అందించారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తికి చెందిన మేకల అంజలి... మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఐఐటీ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. హసన్పర్తి గురుకులంలో నిరుడు ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఐఐటీలో ర్యాంకు సాధించిన అంజలి... కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తనకు సాయం అందించాలని మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసింది.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్... గత సంవత్సరం ఫీజుల నిమిత్తం అవసరమైన ఆర్థికసాయం అందించారు. అంజలి తండ్రి రమేశ్ ఆటో డ్రైవర్ కావడం వల్ల ఐఐటీ విద్యకి అవసరమయ్యే మొత్తాన్ని వ్యక్తిగతంగా ఇస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అంజలి రెండో సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను ప్రగతిభవన్లో అందించారు. ఫీజులు, ఇతర ఖర్చులు, ల్యాప్ టాప్ ఖరీదు నిమిత్తం రూ.లక్షా 50 వేలు ఇచ్చారు. ఆర్థికంగా చేయూత అందించిన మంత్రి కేటీఆర్కు అంజలి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.