Minister KTR fire on modi: సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని మోదీ కల్లబొల్లి మాటలు చెప్పారని ఫైర్ అయ్యారు. 4 బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు లోక్‌సభలో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరించడమంటే రాష్ట్రాన్ని కుప్పకూల్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ తరహాలో గనులు కేటాయించకుండా కేంద్రం కుట్ర పన్నుతుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బొగ్గు గనులు కేటాయించాలన్న అభ్యర్థనను పట్టించుకోలేదని పేర్కొన్నారు. గుజరాత్‌కు మాత్రం గనులు కేటాయించుకున్నారని విమర్శించారు. గుజరాత్‌కు ఒక నీతి... తెలంగాణకు మరో నీతి అమలుచేస్తున్నారా? అని మోదీకి సూటి ప్రశ్న సంధించారు. దీనిపై ప్రధానమంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
''తెలంగాణ పట్ల పక్షపాతం ఇంకెన్ని రోజులు? ఇది ఒక్క సింగరేణి కార్మికుల సమస్య కాదు. సమస్త తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ప్రజా ఉద్యమం తప్పదు. కేంద్ర ప్రభుత్వ సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై పార్టీలకు అతీతంగా రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలి''. - మంత్రి కేటీఆర్
ఇవీ చూడండి