Special Survey in Municipalities: గ్రామ పంచాయతీల అనుమతులతో పుర, నగరపాలక సంస్థల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ‘అనుమతులు గ్రామాల్లో-అంతస్తులు నగరాల్లో’ శీర్షికతో సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై స్పందించింది. పురపాలక మంత్రి కేటీఆర్ ఈ అంశంపై సోమవారం సమీక్షించారు. కరీంనగర్ నగరపాలిక, లక్సెట్టిపేట, బోడుప్పల్, తుర్కయంజాల్, నిజాంపేట, మణికొండ పురపాలికల పరిధిలో నిర్మాణాలపై ప్రత్యేక సర్వే చేసి నిబంధనలు ఉల్లంఘించిన, అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు.
అనంతరం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, డైరెక్టర్ ఎన్.సత్యనారాయణలు ఉత్తర్వులిచ్చారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టవేయాలని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్ల(స్థానిక సంస్థల)కు స్పష్టం చేశారు.
2020 నవంబరు నుంచి అమల్లోకి వచ్చిన టీఎస్‌బీపాస్ నిబంధనల మేరకు భవన నిర్మాణాలు జరగాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల అనుమతులతో గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా రెండు అంతస్తుల వరకే నిర్మించాలన్నారు. అదనంగా నిర్మించుకోవాలంటే విధిగా అనుమతి పొందాలన్నారు. అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థల) ఆధ్వర్యంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీలు.. నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను తనిఖీ చేసి ఉల్లంఘనలపై పురపాలక చట్టం-2019 మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ వివరాలతో పురపాలకశాఖ డైరెక్టర్ సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇవీ చూడండి: