జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ (Minister KTR)స్పందించారు. తెలంగాణ శాసన మండలి వర్షాకాల సమావేశంలో పాల్గొన్న ఆయన... ప్రతి పక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇటీవల ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తిస్తూ... సమగ్ర విచారణ చేపట్టి... నాలా గ్రిడ్ మెరుగుదల కోసం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాము.
మొత్తం ప్రధాన కాలువలను 173 కిలోమీటర్లుగా మదింపు చేసి మొదటి దశ కింద జాబితాను ఖరారు చేశాం. 2021లోనే వర్షాకాలం రాకముందే ఈ పనిని చేపట్టి వరదనీటి డ్రైనేజీ నెట్వర్క్లో కనీసం 30 శాతాన్ని పూర్తి చేయాలనుకున్నాం. జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి.. కిర్లోస్కర్, వోయన్ట్స్ నివేదికలను పరిగణలోకి తీసుకుంటూ... ఎస్ఈపీఈ ఇన్ఫ్రా కన్సల్టెన్సీని సంప్రదించి.. జీహెచ్ఎంసీ జాబితాకి ప్రాధాన్యత ఇచ్చాము. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరం విస్తరణను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టాం. నగరు శివారు ప్రాంతాల్లో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
-మంత్రి కేటీఆర్ (Minister KTR)
మొత్తానికి నగరు శివారులో మంచినీటి సమస్యను ఎలా తీర్చామో... అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఎక్కడైనా వరద సమస్య తీవ్రంగా ఉంటే జోనల్ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం. వాళ్లు రెండు కోట్లు వరకు డబ్బులు విడుదల చేసే అధికారం ఇచ్చామని తెలిపారు. ఆ డబ్బుతో అప్పటికప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కేటీఆర్ (Minister KTR) స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుపై కొవిడ్ ప్రభావం పడిందా అనే ప్రశ్నకు మంత్రి(Minister KTR) సమాధానమిచ్చారు.
కొవిడ్ సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఉపశమన ప్యాకేజీ మిథ్యగా మారింది. కేంద్రం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. పరిశ్రమల శాఖ తీసుకున్న పురోగమన విధానాల వల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. కొవిడ్ సమయంలో కొత్త పెట్టుబడుల వృద్ధిలో ఎలాంటి తగ్గుదల లేదు. 2020 ఏప్రిల్ నుంచి కొత్త యూనిట్ల ప్రారంభంలో కొంత తగ్గుముఖం పట్టింది. 2020-21లో 3,445 కొత్త పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదించాం. 21-22 ఇప్పటివరకు 1777 కొత్త ప్రతిపాదనలు ఆమోదించాం. 20-21 .. 1939 యూనిట్లు... 21-22.. 102 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి.
-మంత్రి కేటీఆర్ (Minister KTR)
కొవిడ్ మహమ్మారి ప్రారంభం నుంచి కొత్త పెట్టుబడులకు తెలిపిన ఆమోదాల వల్ల 2,06,911 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని కేటీఆర్ (Minister KTR) తెలిపారు.
ఇదీ చూడండి: Minister Jagadish Reddy : 'తలసరి విద్యుత్ వినియోగంలో ఐదో స్థానంలో తెలంగాణ'