Telangana Budget Sessions 2023-24 : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలతో, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టారు. మండలిలో బడ్జెట్‌పై చర్చ కొనసాగడంతో పాటు చర్చకు మంత్రి హరీశ్‌రావు ఇవాళ సమాధానమిస్తున్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం నేటి నుంచి మూడు రోజుల పాటు బడ్జెట్ కేటాయింపులపై చర్చ ప్రారంభంకానుంది. ప్రశ్నోత్తరాలలో భాగంగా నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ఈ విధంగా సమాధానమిచ్చారు.
KTR comments on Hyderabad Traffic : హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా... రక్షణశాఖ భూముల విషయంలో కేంద్రం సహకరించటం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఏడున్నరేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా... కేంద్రానికి మనసు రావటం లేదని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్న మంత్రి... రోడ్ల విస్తరణకు అడ్డంకిగా మారిన మతపరమైన నిర్మాణాల విషయంలోనూ చట్టం చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి కేటీఆర్... వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. రెండోదశలోనూ 36 ప్రాజెక్టుల్ని చేపడుతున్నామన్న మంత్రి... త్వరలోనే వాటికి అనుమతిలిచ్చి ముందుకెళ్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని తెలిపారు.
'రక్షణశాఖ భూముల విషయంలో కేంద్రం సహకరించటం లేదు. ఏడున్నరేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవటం లేదు. రోడ్లపై ఉంటే మతపరమైన నిర్మాణాలపై చట్టం చేసే అంశాన్ని పరిశీలిస్తాం. ఎస్‌ఆర్‌డీపీ కింద ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం. మొదటి దశలో మిగిలిన 11 ప్రాజెక్టుల్ని ఈ ఏడాది పూర్తి చేస్తాం. రెండోదశలోనూ 36 ప్రాజెక్టుల్ని చేపడుతున్నాం. త్వరలోనే రెండోదశ పనులకు అనుమతిలిచ్చి ముందుకెళ్తాం'- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
KTR comments on Singareni privatization: సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కానీయబోమని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణిని అస్మదీయులకు కట్టబెట్టేలా కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని పేర్కొన్నారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో గుజరాత్ పట్ల ప్రేమకురిపిస్తున్న కేంద్రం... రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుందని అన్నారు. భయ్యారం విషయంలోనూ కేంద్రం మాటతప్పిందన్న మంత్రి... ముడి ఇనుములో నాణ్యత లేదని తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం ముందుకురాకపోతే సింగరేణి ద్వారా లేదా ప్రైవేట్ రంగం ద్వారా పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని తెలిపారు.
'సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కానీయబోం. ఉద్యమం చేసైనా సింగరేణిని కాపాడుకుంటాం. సింగరేణిని అస్మదీయులకు కట్టబెట్టే కేంద్రం కుట్రల్ని తిప్పికొడతాం. బయ్యారం విషయంలోనూ కేంద్రం మాటతప్పింది. ముడి ఇనుములో నాణ్యత లేదని కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ద్వారానైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేస్తాం.'-కేటీఆర్, పురపాలకశాఖ మంత్రి
ప్రశ్నోత్తరాల్లో ఎస్‌ఆర్‌డీపీ, గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, ఆర్టీసీ ద్వారా సరుకు రవాణా, కళ్యాణలక్ష్మి పథకం, ఏకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు, గనుల రాబడి, సబర్బన్ బస్సుల అంశాలు ఎమ్మెల్యేలు ప్రస్తావనకు తెచ్చారు. వాటికి సమాధానంగా ఏ శాఖకు చెందిన మంత్రి ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సాధారణ చర్చ, మంత్రి హరీశ్‌రావు సమాధానం.. నిన్నటితో ముగిసింది. నేటి నుంచి బడ్జెట్ పద్దులపై మూడురోజులపాటు చర్చ జరగనుంది. తొలి రోజైన నేడు సంక్షేమం, రహదారులు - భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, లెజిస్లేచర్, పౌరసరఫరాలు, పర్యాటక, క్రీడా శాఖలకు చెందిన.. మొత్తం 12 పద్దులపై చర్చచేపడతారు.
ఇవీ చదవండి: