ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎంతో అభివృద్ధి సాధించామని... పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బల్కంపేట్లో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి తలసానితో కలిసి ఆయన ప్రారంభించారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ శ్మశానవాటిక ప్రవేశమార్గం ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన జీహెచ్ఎంసీ... ఆహ్లాదభరితంగా, కావాల్సిన సౌకర్యాలతో నిర్మించింది. వైకుంఠధామం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్.... ప్రణాళికబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
నగరంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా సనత్‌నగర్‌లోనే ప్రారంభించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సనత్‌నగర్ నుంచే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు వైకుంఠధామం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, లింక్‌రోడ్లు నిర్మించామన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. నగరంలో విద్యుత్ ఇబ్బందులు లేవని... ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు.
- ఇదీ చూడండి : ప్రేమికుడే హంతకుడా... అత్యాచారం జరిగిందా?