చైనా నుంచి తరలిపోయే పరిశ్రమలను ఆకర్షించటం, రాష్ట్రంలో మరిన్ని భారీ పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సూక్ష్మ, మధ్యతరహా కంపెనీలు-ఎమ్ఎస్ఎంఈలను ఆదుకునేందుకు.... విద్యుత్ బిల్లులతో పాటు, ఆస్తిపన్ను విషయంలో వెసులుబాటు కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామని కేటీఆర్ వివరించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున .. కరోనా పోరులో పౌరులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. ప్రస్తుత సంక్షోభం ఆరోగ్య రంగంలో అనేక అవకాశాలను తెరపైకి తీసుకొచ్చిందని.. వాటిని అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం పోటీపడుతోందని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ వంటి భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. అన్నిరంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం మరింత సహకారం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశాభావం ఉన్నా.. సవాల్‌తో కూడుకున్న అంశమేనని గ్రహించాలని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టుకు నివేదిక