ASK KTR: తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ట్విట్టర్లో మరోసారి 'ఆస్క్ కేటీఆర్' కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై నెటిజన్ల ట్వీట్లపై కేటీఆర్ స్పందించారు. తమ సుస్థిర, సుపరిపాలనే భాజపా విద్వేష ప్రచారానికి తమ సమాధానమని కేటీఆర్ అన్నారు. భాజపా విషపూరిత అజెండాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని.. తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలుసన్నారు. పలు అంశాలపై భాజపా తప్పుడు ప్రచారం చేయడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ.. అభివృద్ధి చేయలేక పోవడం వల్లనే భాజపా మతమే అజెండాగా మాట్లాడుతోందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామంటున్న భాజపా మాటలను.. సిల్లీ పొలిటికల్ స్టంట్‌గా మంత్రి అభివర్ణించారు. ప్రతీ అకౌంట్లో 15 లక్షల రూపాయలనేది ఈ శతాబ్దపు బూటకపు హామీ అని కేటీఆర్ విమర్శించారు.
జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు..
తనతో చర్చకు రావాలన్న రేవంత్ రెడ్డికి సమాధానమేంటని నెటిజన్లు అడగ్గా... తాను క్రిమినల్స్, 420లతో చర్చకు దిగనని... ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఆయన చర్చించాలని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ వైపు అనుకూల పవనాలు వీస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. యూపీలో భాజపాకు వ్యతిరేకంగా, సమాజ్ వాదీకి మద్దతుగా ప్రచారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా చూడాలనుకుంటున్నామన్న ఓ నెటిజన్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని.. రాష్ట్రానికి సేవ చేయడమే సంతోషంగా ఉందన్నారు.
లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూపై..
కరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకు.. రాష్ట్రంలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏప్రిల్ నెలాఖరుకు ఇంటింటికీ ఇంటర్నెట్ కార్యక్రమం తొలిదశ పూర్తవుతుందన్నారు. విద్యుత్ వాహనాల కొనుగోళ్లపై సబ్సిడీ ఉందని.. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టీఎస్ రెడ్కోతో కలిసి అనేక ప్రైవేట్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ప్రతిష్టాత్మక దేవరకొండ కోట సంరక్షణ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో మాట్లాడుతానన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్ల మూసివేతపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని తెలిపారు. ఉత్తర హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందని.. సుచిత్ర జంక్షన్ ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. బహదూర్ పుర ఫ్లైఓవర్ పనులు త్వరలోనే పూర్తి అవుతాయని తెలిపారు. ఆస్క్ కేటీఆర్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: