అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. క్రైస్తవ స్మృతివనం నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలపై ఆశాఖ ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్‌లో ఆయన సమీక్షించారు.
మూడు జిల్లాల్లో..
దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని క్రైస్తవ సమాజానికి స్మృతివనం ఏర్పాటుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మూడు జిల్లాల్లో 40.1 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. వీటి నిర్వహణ అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి వివరించారు. స్మృతివనం ఏర్పాటు, నిర్వహణ కోసం కమిటీలపై మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.
ప్రతి నెల 25న..
నెలకోసారి సమావేశం జరిపి.. ప్రతి నెల 25న రాష్ట్ర స్థాయి కమిటీకి ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయి కమిటీలో సభ్యులుగా మైనార్టీ శాఖ కార్యదర్శి, ఆ శాఖ డైరెక్టర్, క్రిస్టియన్ కమ్యూనిటికి చెందిన ఇద్దరు బిషప్‌లు కానీ... విశ్రాంత ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉంటారని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి : దళారీ వ్యవస్థను రద్దు చేస్తేనే మాకు బతుకుదెరువు