ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ భూముల రక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా 2676 ఎకరాల ఆలయ భూములను గుర్తించి... 181 ఆలయ భూములకు రక్షణ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని నిరుపయోగంగా ఉన్న ఆలయ భూముల్లో ఐదు కోట్ల రూపాయలతో వాణిజ్య సమూదాయాలను నిర్మించే ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం తెలిపారు. దేవాదాయ శాఖ భూములు పరాధీనం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్న మంత్రి... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దేవాదాయ శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫాలితాల్ని ఇచ్చిందన్నారు. దీనిని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ భూముల రక్షణ విషయంలో దేవాదాయ శాఖ అధికారులు అలసత్వం వీడాలని మంత్రి స్పష్టం చేశారు. భూముల రక్షణకు సంబంధించి దేవాదాయశాఖ అధికారులు సరిహద్దు బోర్డులను ఏర్పాటు చేయాలని... అవసరమైతే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాకారం తీసుకోవాలని సూచించారు. దేవుడి భూముల లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు...
రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్నఆలయ భూములను గుర్తించి, వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాలపై దృష్టి పెట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూముల వేలం ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. లీజు ముగిసిన వెంటనే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పొడిగింపు లేదా తిరిగి వేలం ద్వారా లీజ్‌కు ఇవ్వాలని చెప్పారు. దేవుని మాన్యం భూములను ఆక్రమించి... గృహ, వాణిజ్య భవనాలు నిర్మిస్తే వాటిని నిషేధిత జాబితాలో చేర్చి విద్యుత్, తాగునీటి కనెక్షన్ ఇవ్వకుండా సంబంధిత శాఖలను కోరాలని అధికారులకు మంత్రి సూచించారు. దేవుని మాన్యం వ్యవహరంలో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి... పెండింగ్ కేసుల్లో త్వరితగతిన కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. విధి నిర్వహణలో మంచి ప్రతిభ కనబరిచిన దేవాదాయ శాఖ అధికారులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని సూచించారు.
ఇవీ చూడండి:"నిర్బంధాలు, నియంతృత్వాలు మిలియన్ మార్చ్‌ను ఆపలేవు"