చిన్ననీటి వనరుల నిర్వహణ, మరమ్మతుల పనులతో పాటు పేదలకు అందించే సేవలైన ప్రజా పంపిణీ వ్యవస్థ కస్టమ్ మిల్లింగ్, రవాణా సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 48వ జీఎస్టీ మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలను ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం వర్చువల్ విధానంలో జరిగంది.
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులు హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ విజ్ఞప్తులను మంత్రి హరీశ్ రావు సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో చిన్న నీటిపారుదల కింద ఉన్న 46 వేల జలాశయాల ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని... ప్రతి ఏటా వాటి నిర్వహణ ఎంతో ముఖ్యమని అన్నారు. ఎప్పటికప్పుడు చేయాల్సిన వీటి నిర్వహణ, మరమ్మతుల పనులను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, రవాణా సేవలపై జీఎస్టీతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని... పేదలకు అందించే సేవలపై జీఎస్టీని మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్న హరీశ్ రావు... గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే కేంద్రం బీడీలపై వేసిన 28 శాతం జీఎస్టీని గతంలో తీవ్రంగా వ్యతిరేకించామన్న ఆయన... బీడీ ముడిసరుకు అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడంతో పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ ఆకుపై జీఎస్టీని మినహాయించాలని కోరారు. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రతిపాదనలను స్వాగతించిన హరీశ్ రావు... అందుకు సంబంధించిన కొన్ని సంశయాలను సమావేశంలో ప్రస్తావించారు.
టెలికాం సేవలకు సంబంధించి, ట్రాయ్ రూల్స్ వల్ల వినియోగదారుల చిరునామా, పిన్ నెంబర్ పేటీఎం, మోబి క్విక్, బిల్ డెస్క్ తదితర ఆన్ లైన్ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం లేదని... దీంతో వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళ్తుందని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని కోరారు.
చిన్ననీటిపారుదల, పీడీఎస్ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, రవాణా, బీడీ ఆకులపై జీఎస్టీ మినహాయింపులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను మండలి పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్ మెంట్ కమిటీకి సిఫార్సు చేసింది. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు.
ఇటీవల కేంద్రం పాల దగ్గర నుంచి నిత్యవసర వస్తువులపై జీఎస్టీ పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. రాష్ట్ర నేతలు సైతం దీనిని వ్యతిరేకించారు. దీనిపై బీజేపీ నేతలు... జీఎస్టీ సమావేశంలో తెలంగాణ మంత్రి సైతం ఉంటారని... అప్పుడు నోరు విప్పలేదని విమర్శలు చేశారు. తాజాగా జీఎస్టీ కౌన్సిల్‌లో మంత్రి హరీశ్‌రావు పాల్గొని... పలు అంశాలను వ్యతిరేకించడం చర్ఛనీయాంశమైంది.
ఇవీ చూడండి: