రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భానికి ముందు 693 కిలోమీటర్లు మాత్రమే డబుల్ లైన్ రోడ్లు ఉన్నాయని... ఆరేళ్లలో 7,180 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రోడ్లు నిర్మించామని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం 1,029 కి.మీ. నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 432 బ్రిడ్జిలు నిర్మించినట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో పెద్దఎత్తున రోడ్లు, వంతెనలు నిర్మించినట్లు తెలిపారు.
తాగునీటికి పెద్దపీట
తాగునీటిపై జాతీయ సగటు కంటే ఎక్కువగా ఖర్చు చేశామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గడపగడపకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నట్లు కేంద్రం కూడా ప్రశంసించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని హరీశ్‌రావు తెలిపారు. వ్యవసాయ రంగంపై జాతీయ సగటు వ్యయం 6.4 శాతం ఉండగా... రాష్ట్రంలో 11.4 శాతం ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
విద్యాశాఖకు భారీ మొత్తంలో
నేరుగా విద్యాశాఖ మీద ఖర్చు చేసే మొత్తమే కాకుండా... విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల చెల్లింపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల కోసం పరోక్షంగా వెచ్చించిన మొత్తాన్ని విద్యాశాఖ కోసం వెచ్చిస్తున్నట్లుగానే పరిగణించాలని తెలిపారు. 2014 నుంచి 2020 వరకు ఆరేళ్ల కాలంలో విద్యాశాఖ కోసం రూ.96,220 కోట్లు వెచ్చించినట్లు మంత్రి వివరించారు. ఇది రాష్ట్ర బడ్జెట్లో 14.15శాతంగా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు