Gangula review On Digitalization: రాష్ట్రంలో 17,500 చౌక దుకాణాల డిజిటలీకరణ వేగవంతం చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ-పాస్, ఈడబ్ల్యూఎం అనుసంధానం సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ అంశంపై పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ, సుపరి పాలన వేదిక, సర్వీస్ ప్రొవైడర్లతో హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కార్డుదారులకు నాణ్యమైన సేవలు ఇవ్వాలన్న లక్ష్యంతోనే డిజిటలీకరణ చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌక దుకాణాల్లో 2.87 కోట్ల కుటుంబాలు సరకులు తీసుకుంటున్నారని మంత్రి గంగుల వెల్లడించారు. బీపీఎల్ కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈనెలలో జీహెచ్ఎంసీ పరిధిలో 1,545 చౌక దుకాణాలను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విడుతల వారీగా జూన్ కల్లా అనుసంధానం పూర్తి చేస్తామని మంత్రి గంగుల స్పష్టం చేశారు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆధునాతన టెక్నాలజీతో కూడిన ఈ-పాస్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ల అనుసంధానం, వాటి స్టాంపింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని ప్రభుత్వ శాఖ సమన్వయంతో పనిచేసి పూర్తి చేయాలని సూచించారు. చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర సరకులు తీసుకునే కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ డీఎల్ఎం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అసిస్టెంట్ కంట్రోలర్లు, సీజీజీ డైరెక్టర్, పౌరసరఫరాల అధికారులు, విజన్ టెక్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: KTR About Puvvada : 'బండి సంజయ్ మర్డర్ చేశారని నేనంటే.. నమ్ముతారా?'