Review Meeting on Yasangi Paddy Collection: హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో యాసంగి ధాన్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ఏడాది ఇదే సమయానికన్నా రెట్టింపు మించి కొనుగోళ్లు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కమార్, సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాల నేపథ్యంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, కొత్త కేంద్రాల ఏర్పాటు, ఇతర ఇబ్బందులపై కమిటిలో విస్తృతంగా చర్చించారు. ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రైతన్నలకు పూర్తి స్థాయిలో అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేందుకు వీలుగా.. భారీగా 7వేల 142 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో 4 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి గంగుల చెప్పారు. గత ఏడాది ఇదే రోజు 1.90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ చేస్తే.. ఈ ఏడాది రెండున్నర రెట్లు అధికంగా 5.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. రోజుకు 90 వేల మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తూ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి రక్షణగా 100 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడా 1లక్ష 45వేల 163 పట్టాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Yasangi paddy collection: ప్యాడీ క్లీనర్లు సైతం 6వేల 55, వెయింగ్ మిషన్లు 12 వేల 671, ఇతర మౌలిక సదుపాయాలు సైతం కల్పించామని గంగుల తెలిపారు. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి చేయాల్సింది రాజకీయం కాదని.. రైతులకు భరోసా కల్పించి కేంద్రం నుంచి బాయిల్డ్ రైస్‌కు సానుకూలంగా నిర్ణయం ఇప్పించాలని ప్రతిపక్షాలకు సూచించారు.
కేంద్రం ధాన్యం సేకరణలో నిర్ధేశించిన కనీస నాణ్యత ప్రమాణాల మేరకే ధాన్యం సేకరించాల్సి వస్తుందన్నారు. అయినప్పటికీ అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యం విషయంలో కేంద్రం సహకరించకున్నా.. ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. గ్రామాల్లో రైతులు విధిగా ఆరబోసిన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి: