Minister Gangula Kamalakar fires on Revanthreddy : ప్రభుత్వంపై విపక్షాలు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనను సాకుగా చూపి కుట్రలు చేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ లబ్దికోసం విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శాసనమండలి చీఫ్ విప్ భానుప్రసాద్, ఎమెల్సీ ఎల్.రమణ, బీఆర్‌ఎస్ కార్మిక విభాగం నేత రూప్‌సింగ్‌తో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
పేపర్ లీకేజీని ప్రభుత్వమే బయటపెట్టింది : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నిన్న కేటీఆర్ పూర్తి స్పష్టత నిచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగితే మంత్రులు రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నాపత్రాల ఘటనను కాంగ్రెస్, బీజేపీలు బయటపెట్టలేదన్న మంత్రి గంగుల... ప్రభుత్వమే బయటపెట్టిందన్నారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడిందని తెలియగానే ప్రభుత్వం సిట్ వేసిందని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై సీరియస్ యాక్షన్ ఉంటుంది : ఇది స్కాం కాదని ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుమాత్రమేనని గంగుల పేర్కొన్నారు. రోశయ్య ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగాయని... అప్పటి ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారా అని గంగుల ప్రశ్నించారు. 2010లో యూపీపీఎస్సీలో ఐపీఎస్ అధికారి తప్పు చేస్తే ప్రధాని రాజీనామా చేశారా అని నిలధీశారు. యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని... పారదర్శకంగా ఉన్నందునే పరీక్షలు రద్దు చేసినట్లు గంగుల స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై సీరియస్ యాక్షన్ ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.
'కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బురద చల్లాలి, అవకాశం తీసుకోవాలి... తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో బట్ట కాల్చి మీద వేస్తాం.. మీరే దులుపుకోవాలి అనే విధంగా చాలా దుర్మార్గంగా తెలంగాణ సమాజాన్ని, యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న అంత మంచిగా కేటీఆర్ టీఎస్‌పీఎస్సీ వ్యవహారంపై స్పష్టత ఇచ్చినా కూడా ఈ రోజు మళ్లీ కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అంతర్గత పోటీలో పైచేయి సాధించేందుకే రేవంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తన రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.'-గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
ఇవీ చదవండి: