గాంధీ ఆస్పత్రి వైద్యులపై ఓ రోగి దాడి చేయడం కలకలం రేపింది. కరోనా వార్డులో చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోగా.. విషయం తెలుసుకున్న అదే వార్డులో ఉన్న అతని సోదరుడు వైద్యుడిపై దాడికి తెగబడినట్లు గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు.
ఇటీవలె దిల్లీ నుంచి వచ్చిన అన్నాదమ్ముళ్లు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని.. కాగా ఒకరు మృతి చెందారని శ్రవణ్ పేర్కొన్నారు. దాడి సమయంలో వార్డు సమీపంలో విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చినా.. వార్డులోకి వచ్చేందుకు వారు నిరాసక్తత చూపారని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఘటన స్థలానికి వచ్చి పరిస్థితులను అదుపు చేసినట్లు వెల్లడించారు.
ఘటనపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల... వైద్యులపై దాడిని తీవ్రంగా ఖండించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి.. సేవ చేస్తున్న వైద్యులపై దాడి చేయటం హేయమైన చర్యగా ఈటల అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకుంటామని వైద్యులకు హామీ ఇస్తూ ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చూడండి: కరోనాతో గాంధీలో వ్యక్తిమృతి... వైద్యులపై బంధువుల దాడి