మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ధి సాధ్యం అవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం ఉంటేనే.. సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సమాఖ్య ఛైర్పర్సన్ ఎం.భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
కరోనా కష్టకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖలో 75 శాతం మహిళలు ఉండటం హర్షణీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఐకేపీ సెంటర్లు, పెన్షన్లు అందించడం లాంటి పనులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు మహిళలు చూసుకుంటున్న కుటుంబాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా దిశ, నిర్భయ లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్న మంత్రి.. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీ-టీంలను ఏర్పాటు చేసిందన్నారు. మహిళా భద్రతకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: విమెన్స్ డే స్పెషల్: ప్రతిరోజు ఆమెదే.. స్త్రీ విలువ తెలుసుకో.!