పాలకులు దేశ సమస్యలన్నీ గాలికి వదిలేసి.. హైదరాబాద్ స్థానిక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతుంటే ప్రజల సమస్యల పట్ల ఏమేరకు శ్రద్ధ ఉందో అర్థమవుతోందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొఘల్‌పురలో జరిగిన బహిరంగ సభలో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు గుప్పించారు. కొవిడ్ కారణంగా కోట్ల మంది నిరుద్యోగులుగా మారడమే కాకుండా.. చిన్నచిన్నపరిశ్రమలు మూతపడి దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని పేర్కొన్నారు.
కొవిడ్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది. 12 కోట్ల మంది యువకులు నిరుద్యోగులుగా మారారు. చిన్నచిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. రూపాయి విలువ దారుణంగా క్షీణించింది. చైనా సరిహద్దుల్లో ఎంతో మంది సైనికులు వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాలకులు సమస్యలను గాలికి వదిలేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న స్థానిక సమస్యల ప్రచారం కోసం గల్లీల్లో తిరుగుతున్నారు. వీరంతా హైదరాబాద్‌లో తిరుగుతూ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని.. పాకిస్థానీయులు, రోహింగ్యాలు ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒవైసీ సోదరులను ఓడిస్తే.. అసదుద్దీన్‌ను జిన్నాగా చిత్రీకరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా.. చైనాలో సైనికులు సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోతారా.. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందా.. వీరికి దేశం పట్ల ప్రేమ, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విడగొట్టి అధికారంలోకి రావడమే వీరి ప్రధాన లక్ష్యం.. ఎంఐఎం అలాంటి రాజకీయాలకు దూరంగా ఉంటుంది.
-అక్బరుద్దీన్ ఒవైసీ
ఇదీ చదవండి : ఈ ఎన్నికలు హైదరాబాద్ - భాగ్యనగరం మధ్య: అసద్