కరోనాతో జనజీవనం స్తంభించి.. పనులన్నీ ఆగిపోవడం వల్ల వలసకార్మికులు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండలేక వేలాదిమంది కార్మికులు స్వస్థలాలకు కాలినడకనైనా కదులుతున్నారు. ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్రం ప్రకటించడం వల్ల వలసకూలీలు సికింద్రాబాద్, నగరంలోని ఇతర రైల్వేస్టేషన్లకు వచ్చారు. పోలీసులు వారిని వెనక్కు పంపారు.
అధికారులు సర్దిచెబుతున్నా...
కొన్నిచోట్ల భవన నిర్మాణ రంగ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించడం.. కార్మికులు మాత్రం స్వరాష్ట్రాలకు పయనమవుతుండటంతో ఆందోళన నెలకొంది. దీనిపై కార్మికులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. కష్టమైనా సుఖమైనా అక్కడే ఉంటామంటూ పయనమవుతున్నారు. కుటుంబ సభ్యులను చూడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల నుంచి నగరానికి...
ఇతర రాష్ట్రాల నుంచి పలు జిల్లాలకు వలస వచ్చిన కూలీలు ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కదిలొస్తున్నారు. ఇక్కడి నుంచి రైళ్లు నడుపుతున్నారనే ఆశతో కాలినడకనే చేరుకుంటున్నారు. తమ రాష్ట్రాలకు చెందిన పరిచయస్థుల గదులకు కొందరు వెళ్తుండగా.. మరికొందరు రైల్వే స్టేషన్ల వద్దే నిరీక్షిస్తున్నారు.
ఆందోళనవద్దు.. క్షేమంగా పంపిస్తాం...
రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని క్షేమంగా ఊళ్లకు పంపించనుందని పోలీస్ అధికారులు వలస కార్మికులకు చెబుతున్నారు. పిల్లాపాపలతో రోడ్లపై ఇబ్బందులు పడవద్దని పోలీసులు వారు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో ఉంటున్న వలస కార్మికులతో పోలీస్ అధికారులు మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఏపీ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల అధికారులతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు చర్చిస్తున్నారని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రత్యేకంగా రైళ్లు నడపనున్నారని వారికి వివరించారు. రైళ్లు సిద్ధమయ్యేంత వరకూ రెండు రోజులపాటు భోజనవసతి కల్పిస్తామని చెప్పారు.