హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, టోలీచౌకీ ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 1000 మందికిపైగా వలసకూలీలు తమ సొంత ప్రాంతాలైన రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వెళ్లేందుకు టోలీచౌకి వంతెన వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు.
కూలీల ఆందోళనతో అక్కడికి చేరుకున్న వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కూలీల ఆకలిబాధ తీర్చేందుకు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌తో చర్చించి టోలీచౌకీ ప్రాంతంలో 5 అన్నపూర్ణ క్యాంటిన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకునే వలసకూలీలు సమీపంలోని పోలీస్ స్టేషన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని డీసీపీ శ్రీనివాస్ సూచించారు. బస్సు, రైలు సౌకర్యం కల్పిస్తున్నారన్న వార్తలను నమ్మి ఎవరూ బయటకు రావద్దని కోరారు.