గ్రేటర్ హైదారాబాద్లో మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా గత 5 నెలలకు పైగా మెట్రో సర్వీసులు డిపోలకే పరిమితం కాగా.. కేంద్రం ప్రకటించిన అన్లాక్ 4లో భాగంగా మెట్రో రైళ్లను సెప్టెంబర్ 7న పునఃప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు... సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రైళ్లను తిప్పుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైళ్లను నడిపారు. మొదటి, చివరి స్టేషన్ వద్ద శానిటైజేషన్ చేయించిన తర్వాతే ప్రయాణికులను ఎక్కేందుకు అనుమతి ఇస్తున్నారు. స్టేషన్లలో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉంచారు. మాస్క్లేని వారిని ప్రయాణానికి అనుమతించలేదు.
మొదటి రోజునే మెట్రో రైలు సేవలపై నగర వాసుల నుంచి అనుకున్న దానికంటే మంచి ఆదరణ లభించిందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం మియాపూర్- ఎల్బీ నగర్ మార్గంలో 120 ట్రిప్పులను తిప్పినట్లు తెలిపారు. మొత్తం 19 వేల మంది మెట్రోలో ప్రయాణించారన్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో ఏర్పాట్లపై ప్రయాణకులు సంతృప్తి చెందారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎండీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మెట్రో రైళ్ల పునఃప్రారంభంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటించే విధానం బాగుందన్నారు. నగరంలో సిటీ బస్సులు లేక... మెట్రో లేక ఇంతకాలం అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. స్టేషన్లలో, రైళ్లలో శానిటైజేషన్.... భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు బాగున్నాయన్నారు.
ఇదీ చదవండి: తొలిరోజు 120 ట్రిప్పుల్లో 19వేల మంది ప్రయాణం: మెట్రో ఎండీ