అందమైన కుందనాల బొమ్మరా అన్నాడో సినీ కవి... చందమామ వంటి చిన్నదానా అన్నాడు మరో కవి... ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. అందం ఆడవాళ్లకు సంబంధించిన విషయం అన్న ఆలోచన పూర్తిగా మారిపోయింది. లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఆహార్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
మార్కెట్లో పెరిగిన గిరాకీ:
మార్కెట్లో గిరాకీ బాగా పెరగటంతో వీధికో పార్లర్ వెలుస్తోంది. గత రెండు మూడు సంవత్సరాల్లో పురుషుల సౌందర్య సాధానాల వినియోగం విపరీతంగా పెరిగింది. గతేడాది పురుషుల గ్రూమింగ్ మార్కెట్ 10శాతం అభివృద్ధి సాధించినట్టు మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి.
25 నుంచి 45 మధ్యవారే:
ఒకప్పుడు గ్రూమింగ్లో షేవింగ్ క్రీములు, హెయిర్ కేర్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు రంగుని వృద్ధి చేసుకునే పనిలో పడ్డారు మగమహారాజులు. పెళ్లైనా, వేడుకైనా చివరకి ఆఫీస్ పార్టీలైనా పార్లర్ని విజిట్ చేయాల్సిందే. సుమారు ప్రతి నెల 2 నుంచి ఐదువేల వరకు పురుషుల పార్లర్ బిల్స్ ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వారే సౌందర్య సాధనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
45శాతం రంగు వృద్ధి చేసే ఉత్పత్తులే:
పురుషుల సౌందర్య సాధనాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్నవి, పార్లర్లో ఎక్కువగా తీసుకుంటున్న సేవలు తెల్లగా మారేందుకే కావటం విశేషం. మొత్తం గ్రూమింగ్ మార్కెట్లో 45శాతం రంగు వృద్ధి చేసే ఉత్పత్తులే. ఒకప్పుడు కేవలం హెయిర్ కట్ కోసమే వచ్చే కస్టమర్లు... ఇప్పుడు ఫెషియల్స్ని కూడా ఇష్టపడుతున్నారని పార్లర్ నిర్వహకులు చెబుతున్నారు.
ఓ రేంజ్లో నడుస్తోన్న గ్రూమింగ్ మార్కెట్:
మొత్తంగా పురుషుల గ్రూమింగ్ మార్కెట్ మాత్రం ఓ రేంజ్లో నడుస్తోంది. ఏటా మిలియన్ రూపాయల మార్కెట్ పెరుగుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్ జోరు చూస్తుంటే.. అందం ఆడవారికే కాదండోయ్.. మగవారికీ అవసరమే అన్నట్టు ఉంది.
ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...