Left Parties Meeting in Hyderabad : బీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టులకు చెడిందని.. కాంగ్రెస్‌తో కలిసి జతకడతారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మునుగోడే కాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పారన్నారు. కేసీఆర్ సీట్ల అంశంపై మాతో చర్చించలేదని.. వ్యతిరేకంగానూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకత్వాల సంయుక్త సమావేశం జరిగింది. తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు హాజరయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్‌తో పొత్తు, ఎన్నికల ఎత్తుగడలపై సుదీర్ఘంగా చర్చించారు. సీపీఎం, సీపీఐ కలిసే ఉంటాయని.. కలిసే పోటీ చేస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. మునుగోడులో వచ్చిన విపత్తును సీపీఎం, సీపీఐ పార్టీలు అడ్డుకున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌తో అటు ఇటైతే సీపీఎం, సీపీఐ కలిసి తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తాయని తెలిపారు.
మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం తాము దిగజారమన్న సాంబశివరావు.. పొత్తులపై వెంపర్లాడటం లేదన్నారు. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తామని స్పష్టం చేశారు.
నేడు అప్పటి వ్యవస్థ అవసరం లేదు..: గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటిదని... ప్రస్తుత సమయంలో దేశంలో గవర్నర్ వ్యవస్థ అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. దేశంలో గవర్నర్‌లు ఇప్పుడు రాజకీయ పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థగా మారిందని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళనాడులో మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. మంత్రిని తొలగించే అధికారం సీఎంకు మాత్రమే ఉంటుందన్నారు. తమిళనాడు గవర్నర్ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ గవర్నర్ కూడా యూనివర్సిటీ బిల్లును ఆపి విద్యార్థులకు నష్టం చేస్తుందని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్‌పై కోపంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై బిల్లుల విషయంలో వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. మణిపూర్‌లో రాజకీయ లబ్ది కోసం బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌పై అసంతృప్తి, రాజకీయ భవిష్యత్ కోసం పొంగులేటి కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. రాజకీయాలు విలువలు లేకుండా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: