Counterfeit drugs: దేశంలో నాసిరకం, నకిలీ ఔషధాలు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి. ఔషధ నియంత్రణ వ్యవస్థ బలహీనంగా ఉండడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. జీర్ణ సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, బి విటమిన్, మూర్ఛ, వాంతులు తదితర జబ్బులకు ఉపయోగించే ముఖ్యమైన ఔషధాల్లోనూ నాణ్యతలేనివి సరఫరా అవుతుండడం ఆందోళన కలిగించే అంశం.
2020-21లో దేశవ్యాప్తంగా మార్కెట్‌లోకి వచ్చినవాటిలో 3.12 శాతం ఔషధాలు నాసిరకం కాగా.. 0.29 శాతం పూర్తిగా నకిలీవని తాజాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక వెల్లడించింది. అంతకుముందు అయిదేళ్ల గణాంకాలను చూసినా ఇదే పరిస్థితి. ఏటా 3 శాతానికి తగ్గకుండా నాసి ఔషధాలు ఉత్పత్తి, సరఫరా అవుతున్నాయి. 2016-17లో 0.15 శాతమున్న నకిలీ ఔషధాలు.. 2020-21 నాటికి 0.29 శాతానికి పెరగడం మరో అంశం. ఈ క్రమంలో ఔషధ నియంత్రణ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఈ ఏడాది రూ.1,750 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. నాసిరకం, నకిలీ ఔషధాల ఉత్పత్తిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రాలకూ ఆ అధికారాలు కల్పించినట్లు తెలిపింది.
సిఫార్సులు బుట్టదాఖలు: నాణ్యమైన ఔషధాల ఉత్పత్తి, విక్రయాలకు వీలుగా ‘జాతీయ బయోలాజికల్ సంస్థ’ గతంలో సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. ‘‘నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారణ జరిగాకే.. ఔషధ ప్రచారానికి అనుమతివ్వాలి. ఔషధాల కొనుగోలుకు ముందే ఉత్పత్తి సంస్థల్లో నాణ్యత ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలి. ఔషధాలను జాతీయ గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షించాలి.
ప్రభుత్వ ప్రయోగశాలల సంఖ్యను పెంచాలి. సరఫరా వ్యవస్థను సమగ్రంగా ఆన్‌లైన్‌లో పర్యవేక్షించాలి. తనిఖీ వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ప్రభుత్వ, చిల్లర వర్తక వ్యవస్థలో ఔషధాల నిల్వ గోదాములను నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలి. ప్రజల్లోనూ ఔషధాలపై అవగాహన పెంచడానికి పౌర సంస్థల భాగస్వామ్యాన్ని పెంచాలి’’ అని సిఫార్సు చేసింది. అవన్నీ బుట్టదాఖలే అయ్యాయి.
రాష్ట్రంలోనూ విచ్చలవిడే: తెలంగాణలో ఔషధ నియంత్రణ అధికారులు సేకరించిన నమూనాల్లో గత ఆరేళ్లలో 164 ఔషధాలు నాసిరకమని నిర్ధారణ అయింది. 2020లో 20కి పైగా ఔషధాల్లో నాణ్యత లోపాలను గుర్తించారు. ఇందులో తెలంగాణ సహా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరిల్లో ఉత్పత్తి అయినవి ఉన్నాయి. ఇందులో థైరాయిడ్, శరీరంలో వాపు, అలర్జీలు అసిడిటీ నివారణ, అత్యవసర పరిస్థితుల్లో ఇన్‌ఫెక్షన్లను తగ్గించడానికి ఇచ్చే యాంటీబయాటిక్స్, విరేచనాల నియంత్రణ, నొప్పి నివారణ ఇంజెక్షన్లు, కంటి చుక్కల మందు, స్టెరాయిడ్‌లలోనూ నకిలీవి ఉండడం గమనార్హం.
ప్రభుత్వ వైద్యంలోనూ: తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న ఔషధాల్లోనూ నకిలీవి ఉండడం గమనార్హం. ఈ సంస్థ ఈ ఏడాది సరఫరా చేసిన వాటిలో టెల్మిసార్టన్ 40 ఎంజీ ఔషధం నాసిరకమని తేలడంతో ప్రభుత్వం నిషేధించడం గమనార్హం. గతేడాది సైతం పాంటాప్రోజల్ మాత్రలు సహా ఈ సంస్థ సరఫరా చేసిన అయిదింటిని ప్రభుత్వం నిషేధించింది.
2017-18 నుంచి 2019-20 వరకూ మరో 28 ఔషధాల్ని నిషేధించింది. రాష్ట్రంలో సుమారు 40 వేలకు పైగా ఔషధ దుకాణాలు, 600కి పైగా ఉత్పత్తి సంస్థలుండగా.. ఔషధ నియంత్రణాధికారుల పోస్టులు 71 మాత్రమే ఉన్నాయి. అందులోనూ 53 మందే ఉన్నారు. తగినంతగా మానవ వనరులు లేక పర్యవేక్షణపై ప్రభావం పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లుగా ఇన్‌ఛార్జిల పాలనలోనే ఔషధ నియంత్రణ సంస్థ కొనసాగుతోంది.
ఇవీ చదవండి: విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్, ఈసెట్ తాజా షెడ్యూలు విడుదల..
ఒకే సినిమాలో రజినీ-కమల్.. లోకేశ్ డైరెక్షన్లో భారీ చిత్రం!