హైకోర్టు ఆదేశాల మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు నాలుగున్నరేండ్ల ఫీజును మాత్రమే వసూలు చేయాలని తెలంగాణ ప్రైవేట్ మెడికల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఆ తీర్పుతో వైద్య విద్య చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు రూ. 432 కోట్ల మేర భారం తగ్గుతుందన్నారు.
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నరేళ్లు మాత్రమే. అయినప్పటికీ ప్రైవేట్ వైద్య కళాశాలలు ఐదేళ్ల ఫీజును వసూళ్లు చేయడం అన్యాయమని అన్నారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నాలుగున్నరేండ్లకే ఫీజును తీసుకోవాలని తీర్పు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చట్టం చేసి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాలలో నాలుగున్నరేండ్లకే ఫీజును తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యకు సంబంధించిన ఫీజును నాలుగున్నరేండ్లకు తీసుకునేట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : పోలీసుల అదుపులో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్