Meal facility for farmers in Telangana: వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు ఐదు రూపాయలకే భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేయనుంది. రాష్ట్రంలో 192 ప్రధాన మార్కెట్ యార్డులు, 87 ఉప యార్డులలో వీటన్నింటికీ కలిపి సీజన్ సమయంలో రోజూ దాదాపుగా 8 వేల నుంచి 10 వేల మంది వస్తుంటారు. మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం భోజన సౌకర్యాలు లేవు. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను తీసుకొచ్చే కర్షకులు రోజంతా యార్డులోనే ఉంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. దీంతో యార్డుకి దగ్గరల్లో ఉన్న క్యాంటీన్లు, హోటళ్లకు వెళ్లి భోజనాలు చేస్తారు.
అన్నపూర్ణ పథకం ద్వారా రూ.5కే భోజనం అందిస్తోంది: అధిక శాతం యార్డుల్లో మంచినీటి వసతి కూడా లేదు. అందువల్ల రైతులకు రాయితీపై, భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ పథకం ద్వారా పట్టణాలు, నగరాల ఆసుపత్రుల్లో సహాయకుల కోసం రూ.5కి భోజనం అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ.21 రాయితీ చెల్లిస్తోంది. ఈ పథకాన్ని మార్కెట్ యార్డులకూ విస్తరించాలని భావిస్తోంది.
36 రైతు బజార్లో ఏర్పాటు చేయనున్నారు: రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 10 వేల మంది రైతులకు భోజన సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 36 రైతు బజార్లు ఉన్నాయి. వీటికి వేయి మందికి పైగా రైతులు కూరగాయలు తెస్తున్నారు. రైతు బజార్లలోనూ భోజన వసతుల్లేవు. అక్కడ కూడా ఐదు రూపాయలకు భోజన సౌకర్యం కల్పించనున్నారు.
ఎవరైనా సహకారం అందించేలా ఏర్పాట్లు: ప్రభుత్వం నుంచే కాకుండా.. దాతలు, వ్యాపార సంఘాల వారు, స్వచ్ఛంద సంస్థల అధికారులు, ఛైర్మన్లు భోజన వసతి కల్పించేందుకు ముందుకొస్తే వారికీ అవకాశం కల్పించేందుకు సర్కారు భావిస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, బోయినపల్లి, వంటిమామిడి, ఆదిలాబాద్, నిజామాబాద్, కేసముద్రం, వరంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో దాతలు రాయితీపై భోజనం అందిస్తున్నారు. మిగిలిన యార్డుల్లోనూ దాతలు ఎవరైనా పూర్తి ఖర్చు భరించేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల ఆధ్వర్యంలోనూ ఈ పథకాన్ని ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది.
ఇవీ చదవండి: