Mayor Vijayalakshmi meeting at GHMC office: జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అత్యవసర సమావేశం నిర్వహించారు. అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సంచలనం రేపిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో 5.75 లక్షల వీధి కుక్కలున్నట్లు ఆమె తెలిపారు. కుక్కల కట్టడిలో భాగంగా ప్రతి వార్డులో 20 కుక్కలను దత్తత తీసుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు మేయర్ చెప్పారు.
వీధి కుక్కలకు ఆహారం అందించడం ద్వారా వాటి ఆగడాల్ని నిరోధించనున్నట్లు వివరించారు. సమావేశానికి వెటర్నరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ విభాగాల అధికారులు హాజరయ్యారు. కుక్కల దాడిలో బాలుడి మరణం బాధాకరమని మేయర్ అన్నారు. నగరంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్టకరమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Mayor Vijayalakshmi meeting: ఈ ఘటనలో బాలుడి మృతి తనను ఎంతో కలచివేసిందని చెప్పారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలిన ఘటన హైదరాబాద్ అంబర్‌పేటలోని ఛే నంబర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది.
జంతువులను వేటాడినట్టుగా కుక్కలన్నీ ఆ చిన్నారిపై అన్ని వైపుల నుంచి దాడిచేయడంతో నిస్సహాయంగా శరీరాన్ని వాటికి అప్పగించి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి మృతిపట్ల మంత్రి తలసాని యాదవ్ సంతాపం తెలిపారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. సమస్యపై ఈనెల 23న జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ సిబ్బందితో మంత్రి తలసాని భేటీ కానున్నారు.
రూ.లక్ష ఆర్థికసాయం ప్రకటించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యుల్ని ధర్పల్లి జేడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తన వంతు సహాయంగా రూ.లక్ష నగదు అందించనున్నట్లు ఎమ్మెల్యే తనయుడు బాజిరెడ్డి జగన్ కుటుంబానికి భరోసా కల్పించారు.
ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తా: అదే విధంగా కుటుంబానికి ఆర్థికంగా మరింత ఆదుకునేందుకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోసం మంత్రి కేటీఆర్‌తో మాట్లాడునున్నట్లు వెల్లడించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రమేశ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ జరిగింది: వీధి కుక్కుల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి.. ప్రాణాలొదిలిన హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. శునకాల దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ చిన్నారి విఫలయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. జంతువులపై దాడి చేసిన మాదిరిగా ఆ కుక్కలు మీదపడటంతో నిస్సహాయ స్థితిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు.
'చిన్నారిపై వీధికుక్కల దాడి బాధాకరం. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందనడం సరికాదు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతాం. జీహెచ్‌ఎంసీ తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వీధి కుక్కలను దత్తత తీసుకోవడంపై సలహా వచ్చింది. వార్డులో 20 కుక్కలను దత్తత తీసుకోవడంపై దృష్టి పెట్టాం. నెలకు 600 కుక్కలను దత్తత తీసుకోవడంపై దృష్టి. వీధి కుక్కలకు ఆహారం అందించడానికి చర్యలు చేపడతాం. రోజుకు 160 స్టెరిలైజేషన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. స్టెరిలైజేషన్ తర్వాత అదే స్థలంలో వదిలిపెడుతున్నాం. స్టెరిలైజేషన్ తర్వాత యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు ఇస్తున్నాం. వీధికుక్కల కట్టడికి ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తాం. హైదరాబాద్ పరిధిలో 5.70 లక్షల వీధికుక్కలున్నట్లు అంచనా. వీధికుక్కల విషయమై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. కుక్కలకు నీళ్లు, ఆహారం అందించడం వంటి కార్యక్రమాలు చేపడతాం'. -గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్
ఇవీ చదవండి: