హైదరాబాద్ పంజాగుట్ట శ్మశాన వాటికలో కరోనా మృతుల అంత్యక్రియలతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని మేయర్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. పంజాగుట్ట కాలనీ స్థానిక అధికారులతో ఇవాళ మాట్లాడారు. ఇక్కడికి వచ్చే మృతదేహాలను జన సంచారం లేని సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. నాలాలపై, చెరువులపై అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదన్నారు. టౌన్ ప్లానింగ్ వారు ఎప్పటికప్పుడు ఈ విషయంపై నగరంలో పరిస్థితిని తనకు రిపోర్టు అందించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మేయర్ గద్వాల విజయలక్ష్మి విస్తృతంగా పర్యటించారు. ఎల్బీనగర్ జోన్లో జరుగుతున్న పనులను నగర మేయర్ పరిశీలించారు.
హబ్సిగూడ మెట్రో స్టేషన్ వద్ద మేయర్ స్వయంగా స్ప్రే చేశారు. హబ్సిగూడ పెద్ద చెరువును పరిశీలించి చెరువును సుందరీకరించాలని తెలిపారు. రామంతాపూర్ చిన్న చెరువుని సందర్శించారు. చిలుకానగర్ డివిజన్లోని కల్యాణపూరి రోడ్డులోని హైటెన్షన్ అండర్ గ్రౌండ్ పనులను త్వరలోనే చేపడతామన్నారు. మీర్‌పేట హెచ్‌బీ కాలనీ డివిజన్లో బండబావి, లక్ష్మీనగర్ శ్మశాన వాటిక, మోడల్ నాన్‌వెజ్ మార్కెట్‌ను సందర్శించిన మేయర్... బండ బావి థీమ్ పార్క్ పనులను శ్మశాన వాటిక పనులను త్వరలోనే చేపడతామని చెప్పారు. పెద్ద చర్లపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మేయర్ ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా పని చేస్తే గ్రేటర్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.