IPS Officers Transfers in Telangana: రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సుధీర్ఘ కాలం తర్వాత 91 మందికి స్థానచలనం కలిగిస్తూ.. బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలుమార్లు బదిలీలు జరిగినా పెద్దఎత్తున ఎస్పీలను మార్చడం ఇదే తొలిసారి. గత నెలాఖరున డీజీపీ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. డీజీపీగా అంజనీకుమార్‌ను నియమించటంతో పాటు ఐదారేళ్ల వరకు ఒకే స్థానంలో పని చేసిన ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగించారు. ఆ సమయంలో డీఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు గల ఉన్నతాధికారులను మార్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఎస్పీ.. ఆ పైస్థాయి అధికారులపై దృష్టి సారించింది.
అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు..: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో కసరత్తులు చేసి.. అర్ధరాత్రి తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ, హైదరాబాద్ సంయుక్త కమిషనర్‌లుగా సత్యనారాయణ, గజరావు భూపాల్, రామగుండం కమిషనర్‌గా రెమా రాజేశ్వరి, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డైరెక్టర్‌గా ప్రకాశ్‌రెడ్డి, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా అభిషేక్ మహంతి, శాంతిభద్రతల ఏఐజీగా సన్‌ప్రీత్‌సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా విజయ్‌కుమార్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, అనిశా జేడీగా చేతన, కరీంనగర్ సీపీగా సుబ్బారాయుడు నియమితులు కాగా.. మిగతా వారందరి బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం..: ఇప్పటికే పలు జిల్లాల్లో ఎస్పీలు సుధీర్ఘకాలంగా పని చేస్తున్న వారితో పాటు సీనియర్ అధికారులకు, పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి జాబితాలో చోటుదక్కింది. బదిలీలకు అధికారుల పని తీరుతో పాటు ఆయా జిల్లాలు, కమిషనరేట్ల అవసరాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనుండటంతో.. తాజా బదిలీలకు ప్రాధాన్యం నెలకొంది.
వీరి బదిలీలకు మరికొంత సమయం..: ఇదిలా ఉండగా రాష్ట్రంలో గత కొంతకాలంగా వినిపిస్తోన్న ఐఏఎస్ అధికారుల బదిలీలు మాత్రం మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైన నేపథ్యంలో సమావేశాల తర్వాతే బదిలీలు ఉండవచ్చని అంటున్నారు. అయితే కీలకమైన రెవెన్యూశాఖ సహా మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటికి మాత్రం త్వరలోనే అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
ఇవీ చూడండి..
ORS పితామహుడికి పద్మవిభూషణ్.. ములాయం సింగ్, జాకీర్ హుస్సేన్ సహా ఆరుగురికి