కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చేందుకు తాజా పరిస్థితులను ఆర్థిక కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పీసీసీ కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన మర్రి శశిధర్ రెడ్డి 15వ ఆర్థిక కమిషన్ సిఫారసుల మేరకే ఏప్రిల్ నెలలో కేంద్రం నుంచి తెలంగాణ వాటా కింద రూ. 982 కోట్లు విడుదల అయ్యాయని వివరించారు.
విపత్తు ప్రతిస్పందన నిధి కింద నిర్దిష్ట కార్యకలాపాల కోసం రాష్ట్రాలకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. గత నెలలో సవరించిన నియమావళి ప్రకారం వలస కార్మికులకు తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు, వైద్యం తదితర అవసరాలకు ఈ నిధులు వాడుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. ఇవాళ, రేపు ఆర్థిక సలహా మండలితో ఆర్థిక కమిషన్ సమావేశం కానుందని...ఆ సందర్భంగా రాష్ట్రాల అవసరాలపై చర్చించనుందని వివరించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, నిధుల ఆవశ్యకత తదితర విషయాలను ఆర్థిక కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లయితే అధిక నిధులు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన వివరించారు.