విద్యా సంవత్సరం దాదాపుగా ముగింపు దశకు చేరుకుంటోంది.. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలను తెరిచి తరగతులు నిర్వహిస్తుండగా.. ప్రైవేటు పాఠశాలలు తమకు అనుకూలమున్న రీతిలో.. అటు ఆన్‌లైన్.. ఇటు ఆఫ్‌లైన్‌లో బోధన చేపట్టాయి. కానీ సగం మంది మాత్రమే హాజరవుతున్నారు.
అక్కడ మాత్రం 91 శాతం
ఈ విద్యా సంవత్సరంలో గతేడాది సెప్టెంబరు ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తర్వాత జనవరిలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో దాదాపు 20 రోజులు మూతపడ్డాయి. తర్వాత ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో 35-40శాతం మంది పిల్లల హాజరు ఉండగా.. ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో 50-53శాతం మధ్య ఉంది. కేవలం రంగారెడ్డి 91శాతం హాజరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఎందుకింత తక్కువ..
వాస్తవానికి సాధారణ రోజుల్లో పాఠశాలల్లో హాజరు శాతం 75కుపైగా ఉంటుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం మార్చికి చేరుకున్నా.. 50శాతానికే పరిమితమైంది. కరోనా మహమ్మారి ప్రబలిన తర్వాత చాలా మంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి తిరిగి రాకపోవడంతో పాఠశాలల హాజరు పట్టికలో పేర్లు ఉన్నప్పటికీ.. తరగతిగదికి రావడం లేదని తెలుస్తోంది. 8-10 తరగతి పిల్లలు బడులు మానేసి పనులలో చేరిపోయారు. ‘‘చాలావరకు పాఠశాలల్లో వివిధ తరగతులలో 10-15 మంది విద్యార్థులు రావడం లేదు. ఫోన్ చేసి పాఠశాలలకు పంపించాలని ఎప్పటికప్పుడు చెబుతున్నాం. వీరిలో కొందరు స్వస్థలాలకు వెళ్లిపోవడం, ఇతర పాఠశాలల్లో చేరినట్లుగా చెబుతున్నారు.’’ అని కౌకూర్ జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ వివరించారు.
చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పంపడం లేదు
పాఠశాలల్లో హాజరు శాతం మెరుగుపడింది. కొన్నిచోట్ల ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. పాఠశాలకు పంపడం లేదు. దీనివల్ల హాజరు శాతంలో తేడా కనిపిస్తోంది. ఎవరైనా పనుల్లో ఉంటే తక్షణమే బడిబాట పట్టించాలని చైల్ వెల్ఫేర్, కార్మిక శాఖకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బడిఈడు పిల్లలను పాఠశాలకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు.
- ఐ.విజయకుమారి, డీఈవో, మేడ్చల్ జిల్లా
ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా..
- హైదరాబాద్ జిల్లాలో 693 పాఠశాలలున్నాయి. 96,039 మంది విద్యార్థులుండగా.. 54,231(56.47శాతం) మంది హాజరవుతున్నారు.
- రంగారెడ్డిలో 1338 బడుల్లో 1,68,097కి 1,12,567(66.97శాతం) మంది వస్తున్నారు.
- మేడ్చల్లో 507 పాఠశాలలకు 96,242లో 59,530(61.85శాతం) మంది తరగతి గదుల్లో అడుగిడుతున్నారు.
ఇదీ చదవండి: