Legal notice to Marri Shasidhar Reddy: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా గుర్తింపు పొందిన మర్రి శశిధర్ రెడ్డికి పార్టీ ఎన్నో పదవులు కట్టబెట్టిందని ఆయన అన్నారు. ఆలాంటిది మర్రి శశిధర్ రెడ్డి పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారని, అందువల్లనే ఆయనను క్రమశిక్షణ కమిటీ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించినట్లు పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీలో చేరబోతూ సోనియాగాంధీకి లేఖ ద్వారా తెలియచేసిన అంశాలు పూర్తిగా అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు తాను, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇద్దరు లబ్ది పొందినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా పార్టీపైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు. అదే ఏధంగా అదే లేఖను మీడియాకు పంపిణీ చేసిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.
అదే విషయాలు తెలుగు, ఆంగ్ల పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రచురితమైనట్లు వివరించారు. అవన్నీ తమ పరువుకు భంగం కలిగించేట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన మర్రి శశిధర్ రెడ్డి వారం లోపల ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: